రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ…

Yadadri temple reopen: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన మరి కొన్ని గంటల్లో జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం ప్రారంభం కానుంది. ఈ క్రతువు అనంతరం శ్రీ లక్ష్మీ నారసింహుడి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి యాగజలాలతో మహా సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజ గోపురాలపైనా స్వర్ణకలశాలకు ఒకేసారి 92 మంది రుత్వికులు పూజలు చేస్తారు.

బాలాలయంలో పూర్ణాహుతితోపాటు ప్రతిష్టమూర్తుల శోభాయాత్ర చేపట్టనున్నారు. పునర్ నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ శోభాయాత్రలో సీఎం దంపతులు పాల్గొననున్నారు. గర్భాలయంలో మూలవర్యులకు తొలిపూజ చేసి దర్శించుకోనున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తికాగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొనేందుకు భక్తులను అనుమతించనున్నారు. మహా సంప్రోక్షణ (Yadadri temple reopen) కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ కాంతులతో ఆలయం ధగధగ మెరిసిపోతోంది. మరోవైపు యాదాద్రి వైభవాన్ని చాటేలా హైదరాబాద్‌ నుంచి యాదాద్రి పట్టణం వరకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం క్షేత్రాభివృద్ధికి కృషిచేసిన వారందరిని ఆలయ మాఢదీధిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సన్మానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.