Saleshwaram Jatara: నేటితో ముగియనున్న తెలంగాణ అమర్​నాథ్ యాత్ర సలేశ్వరం

Saleshwaram Jatara: తెలంగాణ అమర్​నాథ్​ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నాగర్​కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాపూర్ శివారు అటవీ లోతట్టు ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య క్షేత్రంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా సలేశ్వరం జాతర ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రాచీన కాలం నుంచి నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల ప్రాంతమైన సలేశ్వరం, లొద్ది మల్లయ్య ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతం కింద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటీ పడతారు. జిల్లాలోని లింగాల మండలం అప్పాయిపల్లి, అమ్రాబాద్ మండలం మన్ననూరు, ఫర్హాబాద్ మీదుగా ఈ క్షేత్రానికి భక్తులు వాహనాలలో చేరుకొని అక్కడి నుండి కాలినడకన చేరుకుంటారు.

తెలంగాణ అమర్​నాథ్ యాత్ర…

Saleshwaram Jatara: రాత్రి పగలు లెక్కచేయక రాళ్లు, రప్పలు, కొండలు కోనలు దాటుతూ 300 అడుగుల లోయలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కఠోర దీక్షతో చేరుకుంటారు. పిల్లాపాపలు, వృద్ధులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. తెలంగాణ అమర్​నాథ్ యాత్రగా ఈ క్షేత్రాన్ని పిలుస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క- సారలమ్మ వీరవనితల జాతర కాగా నల్లమల అభయారణ్యంలో శ్రీ సలేశ్వరం లింగమయ్య శైవ క్షేత్రం జాతర వద్ద చెంచులే పూజారులుగా నిర్వాహకులుగా వ్యవహారిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు నల్లమల ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లా పోలీస్, అటవీశాఖ సంయుక్త పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారుల సమన్వయంతో ఈ జాతరను నిర్వహించారు.

భారీగా టోల్​ రేట్లు…

Saleshwaram Jatara: దైవ దర్శనానికి వస్తే టోల్​గేట్ రూపంలో అటవీశాఖ అధికారులు సామాన్యులు కట్టలేనంత రుసుము పెట్టి భారీగా దండుకుంటున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సలేశ్వరం జాతర ఒక మధురానుభూతిని ఇస్తుంది. ఐదురోజుల పాటు జరిగే ఈ జాతర ప్రకృతి ప్రియులకు సమ్మోహన పరుస్తోంది. కానీ అడవిలో ఉన్న దేవుళ్లను దర్శించుకోవాలంటే ఫారెస్ట్ అధికారులు భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఉమామహేశ్వర దేవాలయం, మద్దిమడుగు దేవాలయానికి చెక్​పోస్ట్​లు పెట్టి వాహనానికి ఇంతని ఫీజులను వసూలు చేస్తున్నారు.

ఏడాదికి ఒకసారి…

ఎన్నో ఏళ్లుగా లింగమయ్యను పూజిస్తూ ఏడాదికి ఒకసారి జరిగే ఈ సలేశ్వరం జాతరను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దైవ క్షేత్రాలకు పుణ్యక్షేత్రాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆలయం అలాగే ఇలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకోని ఎంతో మహత్తరమైన ఈ ఆలయాన్ని బాగు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.