Janasena Protest: ‘ఒక్క ఛాన్స్ అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు’

Janasena Protest
Janasena Protest: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అధికారం కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి… పవర్ చూపిస్తానన్న జగన్ మోహన్ రెడ్డి.. విద్యుత్ ఛార్జీలు పెంచి తన పవర్ చూపించారని ఎద్దేవా చేశారు. ఏపీలో పెరిగిన కరెంట్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ… ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జనసేన పార్టీ నిరసన కార్యక్రమాలు చేయాలని పూనుకుంది. ఉగాది కానుకగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని తీవ్రస్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. పండుగ సందర్భంగా రూ. 1,400 కోట్ల విద్యుత్ ఛార్జీలతో పాటుగా ట్రూఅప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని జనసేనని ఆరోపించారు.
Janasena Protest: రాష్ట్రంలో ఆదాయం, ఇన్‌కం లేకపోవడంతో టాక్స్‌ల రూపంలో ఏ స్టేట్‌లో లేని విధంగా పెట్రోల్, లిక్కర్‌పై అధిక వ్యాట్ వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాజాగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ పథకాలతో ఓ చెత్తో రూ. 10 ఇచ్చి మరో చెత్తో రూ. 20 లాగేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జగన్… పాదయాత్ర చేసిన సందర్భంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మర్చిపోయారని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో మిగులు విద్యుత్ ఉన్న ఆంధ్రప్రదేశ్… ఇప్పుడు కరెంట్ కోతలతో అల్లాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని గ్రామాల్లో 3 నుంచి 6 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తుకురావడం లేదా అంటూ పవన్ ప్రశ్నించారు.
Pawan kalyan on Jagan: పూట గడిస్తే చాలు జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందోనని, ఛార్జీలు భారం మోపుతుందోనని ప్రజలు భయపడుతున్నారని పవన్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతోందని జనసేనాని స్పష్టం చేశారు.
Read Also: పాలన చేతగాకపోతే దిగిపోవాలని.. అంతేకాని…