22 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్… ఎందుకంటే?

దేశభద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న 22 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరఢా ఝుళిపించింది. ఇందులో 18 భారత్‌కు చెందినవి కాగా మరో 4 పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. గతేడాది విడుదల చేసిన ఐటీ రూల్స్ ప్రకారం భారత్‌కు చెందిన యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవటం ఇదే మొదటిసారి. ఇంకా మూడు ట్విట్టర్, ఒక ఫేస్ బుక్, మరో వెబ్ సైబ్ పై కూడా నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ 78 యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం నిషేధం విధించింది. నిషేధం విధించిన యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వ్యూస్ 260 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా అవాస్తవ సమాచారం వైరల్‌గా మారేందుకు ఇమేజ్‌లు, టైటిళ్లను ఎప్పటికప్పుడు మారుస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ ఛానళ్లు భారత్‌కు వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశ సమగ్రత, జాతీయ భద్రత విషయాల్లో ప్రజలను తప్పుదోవపట్టిస్తే ఊరుకునేది లేదని కేంద్రం హెచ్చరించింది.