అప్పట్లో పదో తరగతి ఫలితాలు వస్తున్నాయంటే..!

మా చిన్నతనం లో 10 వ తరగతి ఫలితాలు ప్రకటన……

అంటే అబ్బో భలే సరదాగా వుండేది. ఇప్పటిలా హడావిడి తెలిసేది కాదు. ఎక్కడో పల్లెటూర్లో పాస్, ఫెయిల్ తెలియాలంటే అదో తపస్సులా ఉండేది. రేపు ఫలితాలు ప్రకటిస్తారని పేపర్లో పడింది.. అని ఎవరో చెప్పేవారు.
ఇక చూడండి…
మా పరిస్థితి.. బెరుకుగా, చిన్న భయంతో.. అలా ఇలా ఎవరికీ కనబడకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేసేవాళ్లం. ఎవరైనా కనబడితే ఏమంటారో అనే భయం, బెంగ. ఏరా రేపు వస్తాయట ఫలితాలు. పాస్​ ఔతావా లేదా.. ఇలా ఏమంటారో అనే బెంగ. వాడికేరా పాస్ అవుతాడు.. అని కొంత మంది వీడు ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నాడా… అని మరికొంత మంది పెదవి విరుపులు. ఇక ఆరోజు వచ్చేసింది. సాయంత్రం ప్రాంతీయ వార్తలలో చిన్న వార్త, పరీక్ష ఫలితాలు ప్రకటన జరిగిందని. అప్పుడు ఇలా నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు స్కూల్స్​ లేవు. ర్యాంక్స్​ లేవు.. ఎక్కడో ఏపీ రెసిడెన్సియల్​ స్కూల్స్​, కొడిగేనాపల్లి, తాడికొండ పిల్లలకు రాష్ట్రంలో ఫస్ట్​ వచ్చిందని చెప్పేవారు.

గుండెలు కొట్టుకొనేవి..
మాకు అయితే సాయంత్రం రిజల్ట్ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకంగా వచ్చేది. సాయంత్రం బస్​లో ఎవరో తెచ్చేవారు. దాని ఖరీదు ఒక రూపాయి. మరి చాలా కష్టంగా తెచ్చేవారు. బస్​లో మాపక్క ఊరుకి పేపర్ వచ్చేది. అప్పుడు తెలిసేది ఎవరో తెచ్చారని.. వారింట్లో ఉంది.. వీరి ఇంట్లో ఉందని తెలిసి.. చిన్న కాగితం మీద నంబర్ రాసుకొని వెళ్లేవాళ్లం. ఆ పేపర్ తెచ్చిన వారి ఇంట్లో కుర్రాడు పాస్ అయితే వారు ఆనందంగా అందరికీ ఇచ్చేవారు.. లేకపోతే చాలా చిక్కు సమస్యే.. ఏదో ఒకలా పేపర్ సంపాదించినా నంబర్ చూడటం రాదు. ఎవరో ఒకర్ని నంబర్ చూడటానికి పట్టుకోవడం. అబ్బో ఇదో పెద్ద ప్రహసనం. మొత్తానికి ఒకర్ని పట్టుకొని నంబర్ చూస్తే….అమ్మో ఏమవుతుందో అని గుండెలు కొట్టుకొనేవి.

మన నంబర్ ఏ క్లాస్​లో చూడాలి..
పొద్దున్నే లేచి తప్పనిసరిగా పద్దతి ప్రకారం దేవుడు మొహం చూసుకొనే లేచేవారం. ఆ రోజు చాలా జాగ్రత్తలు తీసుకోనేవారం. నంబర్ సరిగ్గా చూసారా లేదా.. వీడికి నంబర్ చూడటం వచ్చో.. లేదో నిజంగా.. ఇలా చాలా అనుమానాలు. హమ్మయ్య.. ఇక మన నంబర్ ఏ క్లాస్​లో చూడాలి. అనేది ఒక పెద్ద సందేహం. ఏమో ఏమవుతుందో అనే భయం. ఎందుకైనా మంచిదని థర్డ్​ క్లాస్​లోనూ చూడండి అనే వాళ్లం. ఆ నంబర్ చాలా సేపు చూసి.. లేదు అంటే గుండెలు మరింత కొట్టుకోవడం. పోన్లే కంగారు పడకు సెకండ్ క్లాస్​లో చూస్తాన్లే.. ఇక్కడ లేదు.. ఇక చూడాలి మన పరిస్థితి. సరే చూడండీ అని జాగ్రత్తగా పరిశీలిస్తే చూస్తే నువ్వు పాస్ అయ్యవురా ఫస్ట్ క్లాస్​లో అనే మాటకు అబ్బో.. గుండె ఆగిందేమో అనే భయం.. ఇంకా ఏవో అనుభూతులు.. ఆ ఆనందం చెప్పలేము.

నేను ఫెయిల్ అయ్యానని ఇంట్లో చెప్పకు..
స్కూల్ మొత్తం మీద 5 లేదా 10 మందిమే పాస్​ అయ్యవారం. ఇంటికి వచ్చాక మళ్లీ అనుమానం.. ఆయన నిజంగా సరిగా చూశాడాలేదా అని.. మరొకరి వద్ద ఆ పేపర్​ ఉండదు. మా ఫ్రెండ్ అయితే ఒరే నేను ఫెయిల్ అయ్యానని ఇంట్లో చెప్పకు. నువ్వు పాస్ ఆయ్యావని చెప్పుకో.. మా నాన్న కొడతాడు. నిజం స్కూల్ తెరిచిన తరువాత చూద్దాం అనేవాడు. చాక్లెట్లు కొని అందరికీ పంచేవాడు. అది సరదా మరునాడు నిజంగా ఈనాడు, ఉదయం, ప్రభ, వచ్చేవి కొనేవాళ్లం. ఇప్పుడు ఈ పేపర్ నా సొంతం ఎన్ని సార్లు అయినా చూడవచ్చు. అందరి నంబర్స్. సరదాగా చూసేవాళ్లం. ఇక ఫెయిల్ అయిన వారు మాయం అయ్యేవారు.

సరిగ్గా చదవలేదు వెధవ..
పాస్ అయిన వారి గురించి ఊర్లో కథలుగా మాట్లాడేవారు. ఫెయిల్ అయిన వారిని.. సరిగ్గా చదవలేదు వెధవ. అంటూ పాస్ అయిన వారితో పోలుస్తూ మాట్లాడేవారు. చెరువు గట్టు వద్ద, నీళ్ల బావి దగ్గర ఈ పాస్ అయిన వారు హీరోలు. అలా మాగురించి వాళ్ళు చెప్పుకుంటూ వుంటే. అబ్బో ఏదో జయించిన వారిలా గొప్ప ఫోజు.. ఇంట్లో వాళ్ళు అప్పటికి అప్పుడే రవ్వ లడ్డూలు, పకోడీలు వేసి అందరికీ పెట్టేవారు. ఇంటికి పిల్లవాడిని చూడ్డానికి నలుగురు రావడం. అమ్మో వీడికి దిష్టి తీయండిరా అనడం. తరువాత దేవుడి గుడిలకు వెళ్లి మొక్కులు తీర్చుకోవడం. ఇలా చెప్పుకుంటుంటే చాలా…. ఆ రోజులు ఒకసారి గుర్తుకొస్తే.. ఎంతో ఆనందం.

🙏🏻
( ఈరోజు పదవతరగతి పరీక్షా ఫలితాలు సందర్భంగా )

Leave a Reply

Your email address will not be published.