ఏపీలో పొత్తుల రాజకీయం.. రెండేళ్ల ముందు నుంచే..

ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం పొత్తులపై హాట్​ హాట్​ టాపిక్​ నడుస్తోంది. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఇద్దరు ఒకచోట కలిసినా పొత్తులపైనే ప్రస్తావన వస్తోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా… భవిష్యత్​లో ఏం జరగనుందోననే చర్చ జరుగుతోంది. సుమారు సంవత్సర కాలంగా టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు సహా ఆ పార్టీల కీలక నేతలు పొత్తులపై చేస్తున్న కీలక వ్యాఖ్యలే కారణం. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా పార్టీల నేతలు పొత్తుల బాట పట్టడానికి కారణమేంటి.. ఒకవేళ పొత్తుల పెట్టుకుంటే ఎవరికి లాభం చేకూరనుంది.

2014లో..
2014లో టీడీపీ, జనసేన, భాజపా పొత్తుపెట్టుకొని సునాయాసంగా విజయం సాధించాయి. జగన్​ నేతృత్వంలోని వైసీపీ కేవలం 60పైగా స్థానాలకే పరిమితం అయింది. అప్పట్లో జనసేన ఎక్కడా పోటీచేయలేదు. టీడీపీ, భాజపా అభ్యర్థులకు మద్దతు తెలిపింది. టీడీపీ, భాజపా కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ జట్టు రెండు మూడేళ్లపాటు కలిసికట్టుగా పనిచేసినా.. తర్వాత చెడింది. ఏపీ విభజన హామీలను అమల్లో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు కేంద్ర పెద్దలకు వినతి పత్రాలు సమర్పించినా వారినుంచి పెద్దగా స్పందన లేదంటూ వారితో తెగతెంపులు చేసుకున్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారు. టీడీపీ సహా జనసేన, భాజపా సహా ఇతర పార్టీలు ఊహించని విధంగా జగన్​కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 151 స్థానాల్లో అప్రతిహత విజయాన్ని కట్టబెట్టారు. టీడీపీని 23 స్థానాలే గెల్చుకోగా.. జనసేనాని పోటీచేసిన గాజువాక, భీమవరం రెండింటా ఓటమి చవిచూశారు. భాజపా సహా ఇతర పక్షాలకు డిపాజిట్లూ దక్కలేదు.

ఇన్నాళ్లు ఒంటరి పోరే..
జగన్​ అధికారంలోకి వచ్చాక.. కొన్నాళ్లు ఎవరికి వారే ఒంటరిగా పోరాటాలు చేసుకొచ్చారు. గత ఫలితాలపై సుదీర్ఘ విశ్లేషణలు చేసుకున్నారు. పలు సందర్భాల్లో పొత్తులపై ఎవరికి వారే ప్రకటనలు చేశారు. కలిసి వచ్చే వారితో ముందుకెళ్తామంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత దీనిపై సానుకూలంగా స్పందించారు. కానీ తమది వన్​ సైడ్​ లవ్​ అంటూ పొత్తులపై వ్యాఖ్యానించారు. దీనిపై జనసేనాని సైతం సరైన సందర్భంలో స్పందిస్తామని చెప్పాకొచ్చారు. తాజాగా గత నెలలో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్న బహిరంగ సభల్లో పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ వ్యాఖ్యలను కొందరు విలేకరులు జనసేనాని వద్ద ప్రస్తావించారు. దానిపై స్పందించిన పవన్​ కల్యాణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం భాజపాతో పొత్తులో ఉన్నామని.. భవిష్యత్​లో తమతో ఎవరుంటారో చెప్పలేమన్నారు. అయితే అన్ని పక్షాలను కలుపుకొనే ఎన్నికలకు వెళ్తామని కొన్ని రోజుల క్రితం స్పష్టం చేశారు.

పొత్తులపై పవన్​ క్లారిటీ..
అయితే ఈలోగా టీడీపీ మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించింది. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. ఈ వేదికపైనే చంద్రబాబు నాయుడు.. జగన్​ సర్కార్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్​ వన్​సైడ్​ అయిందని రానున్న ఎన్నికల్లో తమదే విజయమని చెప్పుకొచ్చారు. తాజాగా నిన్న జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్​ కల్యాణ్​ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. జగన్​ను ఎటిపరిస్థితుల్లోనూ ఇంటికి పంపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్నట్లే భాజపాతో కలిసి ముందుకెళ్లడం, టీడీపీ, భాజపాతో ఎన్నికల బరిలో నిలవడం, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వంటి అంశాలున్నాయన్నారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా వెనక్కి తగ్గామని.. ఈసారి అవతలి వారు తగ్గాలని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. అధికార పార్టీపై సాధారణంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఎన్నికలకు తీసుకెళ్లి ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి. ఎవరు ఎలా వెళ్లినా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మరో రెండేళ్లు వేచి చూడాలి.
– దిలీప్​కుమార్​

Leave a Reply

Your email address will not be published.