Mannava Balayya Passes Away: పుట్టినరోజు నాడే మరణించిన ప్రముఖ నటుడు

Mannava Balayya Passes Away: టాలీవుడ్​లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్​గూడలోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. 94 ఏళ్ల వయస్సున్న ఆయన పుట్టినరోజు నాడే మరణించడం బాలయ్య కుటుంబంలో… చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎత్తుకు పై ఎత్తు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలయ్య… సుమారు 300కుపైగా చిత్రాల్లో నటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, కథా రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్వతీ కల్యాణం, ఇరుగు పొరుగు, బొబ్బిలి యుద్ధం, పాండవ వనవాసం, మొనగాళ్లకు మొనగాడు, అల్లూరి సీతారామరాజు, ప్రాణ స్నేహితులు, పెద్దరికం, గాయం, యమలీల, పెళ్లిసందడి, అన్నమయ్య, మన్మథుడు, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం చిత్రాల్లో బాలయ్య తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


నిర్మాతగానూ
Mannava Balayya Passes Away: నటుడిగానే కాకుండా నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థను స్థాపించి శోభన్ బాబుతో చెల్లెలి కాపురం, కృష్ణతో నేరము-శిక్ష, చిరంజీవితో చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట చిత్రాలను బాలయ్య నిర్మించారు. పసుపుతాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఊరికిచ్చిన మాట చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా మరో నందిని అందుకున్నారు. బాలయ్య మరణం పట్ల తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఈ సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్​లోని మహాప్రస్థానంలో బాలయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు తులసీరామ్ తెలిపారు.

బాలకృష్ణ సంతాపం…

Mannava Balayya Passes Away: సీనియర్ నటులు మన్నవ బాలయ్య మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్​తో నటించిన బాలయ్య… తన చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించిన అద్భుతమైన నటుడని బాలకృష్ణ కొనియాడారు. బాలయ్యతో నందమూరి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్న బాలకృష్ణ… నటుడు, నిర్మాత, దర్శకుడు, కథా రచయితగా బాలయ్య చక్కటి ప్రతిభ చూపారని తెలిపారు. బాలయ్య మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు.


మన్నవ బాలయ్య మరణం నన్ను కలిచివేసింది. నాన్నతోపాటు నా చిత్రాల్లోనూ బాలయ్య మంచి పాత్రలు పోషించారు. బాలయ్యతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Leave a Reply

Your email address will not be published.