ఇళ్లకు తాళాలు వేసి నిప్పు… 8 మంది సజీవ దహనం

fire accident
పశ్చిమ బంగాల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. టీఎంసీ నేత హత్య అనంతరం చెలరేగిన ఉద్రిక్తతల్లో 8 మంది సజీవ దహనమయ్యారు. బీర్భూమ్ జిల్లా బర్షాల్ గ్రామ పంచాయతీ టీఎంసీ నేత భదు ప్రధాన్… సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై నాటు బాంబులు విసరడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున రాంపూర్హట్ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మనుషుల్ని లోపల పెట్టి, ఇళ్లకు తాళాలు వేసి నిప్పటించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10 నుంచి 12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భదు ప్రధాన్ హత్యకు ప్రతీకారంగానే ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదన్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.