చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం… 8 మంది మృతి

Chittoor Bus Accident: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘేర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మారుతి నగర్‌కు చెందిన యువకుడి నిశ్చితార్థం కోసం… తిరుచానూరుకు ఓ ప్రైవేటు బస్సులో 50 మంది పైగా బయలుదేరారు. భాకరాపేట వద్ద బస్సు అతివేగంతో లోయలోకి దూసుకెళ్లడంతో వరుడి కుటుంబానికి చెందిన నలుగురు, ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కూడా మరణించారు. 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై (Chittoor Bus Accident) ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై టీడీపీ చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల బంధువులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.