New variant : భారత్‌లో కొత్త వేరియంట్… తొలి కేసు నమోదు

New variant బ్రిటన్‌లో వెలుగుచూసిన న్యూ కరోనా వేరియంట్ XE తొలికేసు భారత్‌లో నమోదైంది. ముంబైలో ఎక్స్ఈ వేరియంట్ తొలికేసు బయటపడింది. ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీనితో పాటు మరో కప్పా వేరియంట్ కేసు కూడా… సీరో సర్వేలో బయటపడినట్లు తెలిపారు. 230 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా 228 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ బయటపడినట్లు వివరించారు. 230 మందిలో 21మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరికీ ఆక్సిజన్ అవసరం రాలేదన్న బీఎంసీ అధికారులు.. ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో 12 మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని తెలిపారు.
New variant ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియంట్ ఎక్స్ఈ సోకిన బాధితుడికి తీవ్రమైన లక్షణాలు లేవని వెల్లడించారు. ఎక్స్ఈ సోకిన బాధిత మహిళ ఈ ఏడాది ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. సాధారణ పరీక్షల్లో భాగంగా మూడు వారాల తర్వాత మార్చి రెండున జరిపిన టెస్ట్‌లో మహిళకు కొవిడ్ సోకినట్లు తేలిందని వెల్లడించారు. మహిళలో ఎలాంటి లక్షణాలు లేవన్న అధికారులు మరుసటి రోజే నెగటివ్ వచ్చిందని వివరించారు. ఒమిక్రాన్ రకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమ ఉత్పరివర్తనంగా ఎక్స్ఈ సబ్‌వేరియంట్‌ను భావిస్తున్నారు. ఈ వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
XE వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ కరోనా రకాలలో అత్యధిక సాంక్రమికశక్తి ఉన్న ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2 కంటే 10శాతం ఎక్కువగా వ్యాపించే గుణం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో మాస్కులపై అశ్రద్ధ వద్దంటున్న నిపుణులు… మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని హెచ్చరిస్తున్నారు. కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంతవరకు కొవిడ్ నిబంధనలను ప్రభుత్వాలు ఎత్తివేయకూడదని సూచిస్తున్నారు.